జగన్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై?




కాంగ్రెస్ గూటికి మల్లాది విష్ణు?

అక్షరవిజేత, ఏపీ బ్యూరో :

నిన్నటి వరకూ అదిగో ఇదిగో అంటూ ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్‌ లిస్ట్‌ వచ్చేసింది. మొదట జాబితాలో 11 మందిని మార్చేయగా.. ఇప్పుడు 27 మందిని మార్చేశారు. మొత్తంగా వైసీపీ 38 మంది ఇన్‌ఛార్జ్‌ల్ని ఇప్పటివరకు మార్చేసింది. ఫస్ట్‌ లిస్ట్‌లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటిస్తే, సెకండ్‌ లిస్ట్‌లో  ఎంపీ టికెట్స్‌ కూడా ప్రకటించేశారు. సెకండ్‌ లిస్ట్‌లో 11 మంది సిట్టింగ్‌లకు షాక్‌ ఇచ్చారు జగన్‌.  వీళ్లల్లో 10 మంది ఎమ్మెల్యేలు కాగా, ఒకరు ఎంపీ. వీరిలో కొందరు తీవ్ర ఆగ్రహంతో ఉండగా.. మరికొందరు అసలు పోటీ చేసేవరకూ నమ్మకం లేదని తెలుస్తున్నది. ఇక టికెట్ లేదని తేలిన వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వంటి కొందరు ఎమ్మెల్యేలు తాము చేసిన తప్పేంటో చెప్పాలని, తమకు టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వెల్లడించాలని జగన్ ను   ప్రశ్నిస్తున్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న వారిలో విజయవాడ సెంట్రల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఒకరు.‌  

విష్ణుకు జగన్ షాకిచ్చారు. సెంట్రల్‌ ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో విష్ణు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఆయన అనుచరులైతే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనకు టికెట్ లేదన్న అధిష్టానం నిర్ణయంతో మల్లాది విష్ణు అనుచరుల ఆందోళన బాట పట్టారు. బందరు రోడ్డులో విష్ణు అనుచరులు బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీకీ, జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విష్ణుకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. విష్ణును మార్చడంపై అసంతృప్తితో రగిలిపోతున్న విష్ణు వర్గం త్వరలోనే జింఖానా మైదానంలో సమావేశమై.. జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలని.. తమ డిమాండుకు తలొగ్గకపోతే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

నిజానికి విష్ణు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన నేత. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డికి విష్ణు అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పుకుంటారు. అలాంటి విష్ణుకు జగన్ హ్యాండిచ్చేశారు. మల్లాది విష్ణు కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ హయాంలో వుడా చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత విష్ణు వైసీపీకి మారారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి విజయం సాధించారు. దీంతో జగన్ విష్ణుకు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా నియమించి ఆయనకు కేబినెట్ హోదాను కూడా కల్పించారు. రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిలో కొనసాగారు. ఈసారి ఎలాగైనా అదే సెంట్రల్ నుండి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.

కానీ, జగన్ ఆయనకు షాక్ ఇస్తూ ఆయనను అక్కడ నుండి లేపేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన రాజకీయ ప్రస్థానం ఏ పార్టీతో మొదలైందో మళ్ళీ అదే పార్టీకి వెళ్లడానికి డిసైడైపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన మల్లాది విష్ణు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మల్లాది షర్మిలతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తుండడంతో పాటు ఏపీపై ఫోకస్‌ పెడతారన్న ప్రచారం సమయంలో విష్ణు మళ్లీ తిరిగి హస్తం గూటికే చేరే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. ఆ మాటకొస్తే విష్ణు ఒక్కడే కాదు.. అదే బాటలో చాలామంది అసంతృప్త వైసీపీ ఎమ్మెల్యేలకు షర్మిల బెస్ట్ ఛాన్స్ గా మారేలా కనిపిస్తుంది. వైసీపీలో గెలుపు అవకాశం లేని ఎమ్మెల్యేలు, స్థానాల మార్పునకు ఇష్టపడని నేతలు, అసంతృప్త ఎమ్మెల్యేలు అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ ఛాయిస్ గా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే షర్మిల వెంట నడుస్తూ.. కాంగ్రెస్ లోకి వెళ్లే తొలి వైసీపీ ఎమ్మెల్యే తానేనని కూడా ప్రకటించేశారు. ఈ క్రమంలో ఇదే బాటలో ఎంతమంది నడవనున్నారో చూడాల్సి ఉంది.
 


Latest News
more

Trending
more