ఆస్ట్రేలియాదే ఆధిపత్యం.. 166/2




బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి సిడ్నీలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలుత తడబడినా.. తర్వాత పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5) సిరాజ్ బౌలింగ్‌లో రెండో స్లిప్‌లో ఉన్న పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. గత నాలుగేళ్లలో డేవిడ్ వార్నర్ సింగిల్ డిజిట్ పరుగులకే అవుటవడం ఇదే తొలిసారి. అయితే కాసేపటికే వర్షం పడటంతో ఆటను నిలిపేశారు. తొలి సెషన్‌లో కేవలం 7.1 ఓవర్ల ఆటమాత్రమే సాధ్యం అయ్యింది. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ 21/1

వర్షం ముగిసిన తర్వాత రెండో సెషన్ ప్రారంభించారు. ఓపెనర్ పకోస్కీ (62), మార్నస్ లబుషేన్ కలసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఇద్దరూ కలసి నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే టీమ్ ఇండియా చెత్త ఫీల్డింగ్ కారణంగా పకోస్కీ పలుమార్లు అవుట్ నుంచి తప్పించుకున్నాడు. పకోస్కీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను పంత్ వదిలేశాడు. మరోవైపు లబుషేన్ రనౌట్ అయ్యే అవకాశం వచ్చినా టీమ్ ఇండియా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. తొలి మ్యాచ్ ఆడుతున్న సైనీ.. పకోస్కీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో తన తొలి అంతర్జాతీయ టెస్టు వికెట్ తీశాడు.

ఇక చివరి సెషన్‌లో లబుషేన్(67 నాటౌట్), స్టీవ్ స్మిత్ (31 నాటౌట్) కలసి దూకుడుగా ఆడారు. టీమ్ ఇండియా బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. బౌండరీలతో స్కోర్ బోర్డు వేగం పెంచే ప్రయత్నం చేశారు. టీమ్ ఇండియా బౌలర్లు కూడా వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి ప్రయత్నించారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ అజేయంగా 60 పరుగులు జోడించారు. తొలి రోజు కేవలం 55 ఓవర్ల ఆటకు మాత్రమే అవకాశం కుదిరింది. దీంతో ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులతో పటిష్టంగా ఉన్నది. తొలి రోజు ఆట మొత్తం ఆస్ట్రేలియా ఆధీనంలోనే ఉంచుకుంది. తొలి సెషన్ తప్ప మిగతా సెషన్లు అన్నీ ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది. సైనీ, సిరాజ్ చెరో వికెట్ తీశారు.

 


Latest News
more

Trending
more