అఖిలప్రియే ఏ1.. స్కెచ్ మొత్తం ఆమెదే.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు




హఫీజ్‌పేట భూవ్యవహారంలో జరిగిన కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియే కీలక సూత్రధాని అని పోలీసులు తెలిపారు. దాదాపు రూ. 2వేల కోట్ల విలువైన భూమికి సంబంధించి గత కొన్నేళ్లుగా అఖిలప్రియకు కేసీఆర్ బంధువైన అఖిలప్రియకు మధ్య వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ రావు, అతడి కుటుంబీకులను కిడ్నాప్ చేయించిందని పోలీసులు తెలిపారు. అందుకే గతంలో ఏ2గా అఖిల ప్రియను పేర్కొన్నా.. తాజా ఎఫ్ఐఆర్‌లో మార్పులు చేసి ఆమెను ఏ1గా చేర్చామని, ఏపీ సుబ్బారెడ్డిని ఏ2గా, భార్గవ్ రామ్‌ను ఏ3గా పేర్కొన్నారు.

రిమాండ్ రిపోర్టులో వెల్లడించలన అంశాల మేరకు.. హఫీజ్‌పేట సర్వే నెంబర్ 80లో ఉన్న 25 ఎకరాలను మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు 2016లో కొనుగోలు చేశారు. కాగా, ఆ భూమి తమదేనని అఖిలప్రియ, భార్గవ్ రామ్, ఏవీ సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. అయితే ప్రవీణ్ రావు ఈ భూ వివాదాన్ని ఏవీ సుబ్బారెడ్డికి డబ్బులు చెల్లించి సెటిల్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భూమా అఖిల ప్రియ రంగంలోకి దిగి.. సుబ్బారెడ్డితో ఎలా సెటిల్ చేసుకుంటారని.. అది మా నాన్న కొన్న భూమి అని తమకు డబ్బులు చెల్లించాలని ప్రవీణ్ రావుపై ఒత్తిడి తెచ్చారు. అయితే అదనపు సొమ్ములు చెల్లించడానికి ప్రవీణ్ రావు నిరాకరించారు.

దీంతో అఖిల ప్రియ తన భర్త భార్గవ్ రామ్‌తో కలసి కిడ్నాప్‌కు స్కెచ్ గీశారు. కిడ్నాప్ వ్యవహారాల్లో ఆరితేరిన సాయి అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నారు. పథకం ప్రకారం ప్రవీణ్ రావు ఇతరులను కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలోని ఒక ఇంటికి తీసుకొని వెళ్లారు. అక్కడ ఖాళీ బాండ్ పేపర్లపై ప్రవీణ్ రావుతో సంతకాలు చేయించుకున్నారు. ఆ సమయంలో సాయి పదేపదే అఖిల ప్రియ, భార్గవ్ రామ్, సుబ్బారెడ్డి పేర్లతో బెదిరించాడు. అంతే కాకుండా వారితో ఫోన్లో కూడా సంభాషించాడు. అంతేకాకుండా బాధితులపై కర్రలతో కూడా దాడికి పాల్పడ్డాడు. సంతకాల అనంతరం తిరిగి వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోనికి తీసుకున్నారు.

మాజీ మంత్రిగా అఖిల ప్రియ సాక్ష్యాలను తారుమారు చేసే బలం కలిగి ఉన్నదని.. అందుకే ఆమెను అరెస్టు చేసి ఏ1న చేర్చామని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమె భర్త భార్గవ్ రామ్‌కు కూడా నేర చరిత్ర ఉన్నదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏ1ని అరెస్టు చేశామని.. ఏ2 సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇక ఏ3 భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులైన శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాశ్ లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.


Latest News
more

Trending
more