డ్యామేజీకి అతుకు వేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నం




ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో జగన్ సర్కార్ ఇమేజ్ కు దేశంలోనే డ్యామేజీ అయింది. దీనికి అతుకు వేసేందుకు జగన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా పుష్కరాల సమయంలో టీడీపీ హయాంలో కూల్చివేసిన ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పాలనలో విజయవాడలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు హయంలో మొత్తం 21 దేవాలయాలను కూల్చారని తమ ప్రభుత్వం తొలి విడతగా వాటిలో 8 ఆలయాలను పునర్నిర్మించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. 

రెండో విడతలో మరికొన్ని ఆలయాల పునర్నిర్మాణం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వీటితోబాటు రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేతలకు గురైన ఆలయాలను కూడా నిర్మించే ఆలోచనలో ఏపీ సర్కారు ఉందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ దుర్గగుడి అభివృద్ధికి 70 కోట్లు ఇచ్చారంటూ మంత్రి వెల్లంపల్లి ప్రభుత్వ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేశారు. గత కొంత కాలంగా జరుగుతున్న దాడులతో జగన్ సర్కార్ ముప్పేట దాడిలో చిక్కుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి మాత్రమే గాక హిందూ సంఘాల నుంచి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవలే రామతీర్ధంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ-జనసేన కూడా ఈ అంశంపై ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

ఈ మొత్తం ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినబడుతున్నాయి. చంద్రబాబు హయంలో ఒక్క విజయవాడలోనే 21 దేవాలయాలను కూల్చారని చెప్పడమే గాక వాటిని తాము పునర్నిర్మాణం చేశామని చెప్పుకునే అవకాశం జగన్ సర్కార్ కు లభిస్తుందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. క్రైస్తవులకు, ముస్లిములకు మాత్రమే జగన్ సర్కార్ లబ్ది చేస్తోందనే ప్రచారానికి కూడా చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


Latest News
more

Trending
more