ఓటమి భయంతో జగన్ సింపతీ గేమ్




*ఓటమి భయంతో జగన్ సింపతీ గేమ్*

అక్షరవిజేత, ఎడిటర్ అనిల్ కుమార్ :

ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అనుకున్నదొకటైతే.. జరిగేది పది రకాలుగా కనిపిస్తుంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడం.. ఆమె ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం  చాలా కాలంగా ఊహిస్తున్నదే. ఈ మేరకు గురువారం (జనవరి 4)షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక అతి త్వరలోనే ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అందుకోవడం గ్యారంటీగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వేంటనే పార్టీ అండమాన్ లో పని చేయమన్నా చేస్తానంటూ షర్మిల విధేయత చాటారు. ఇలా ఉండగా గురువారం (జనవరి 4) షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోగా అంతకు ముందు వారం రోజుల నుండి షర్మిల ఏపీలోనే పర్యటిస్తున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానాలు అందించడం, కుమారుడు, కాబోయే కోడలితో కలిసి ఇడుపుల పాయ వెళ్లి తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రార్ధనలు చేయడం, అక్కడే షర్మిల కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణంపై ప్రకటనలు చేయడం ఆసక్తిగా కలిగించాయి. అలాగే తల్లి విజయమ్మతో కలిసి తాడేపల్లికి వెళ్లి అన్న జగన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడం మరింత ఆసక్తిని రేపింది.మొత్తంగా జనవరి తొలి వారంలో ఏపీ రాజకీయాలలో షర్మిల కేంద్రబిందువుగా మారారు.  ముఖ్యంగా షర్మిల ఏపీ పర్యటన సందర్భంగా  ఊహించని మలుపులు, కలయికలు కనిపించాయి. షర్మిలకు అన్న జగన్ తో చాలా కాలంగా సత్సంబంధాలు లేవు. ఇది అందరికీ స్పష్టంగా తెలిసిన అంశమే. ఇప్పుడు షర్మిల ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి అన్న జగన్ మోహన్ రెడ్డితోనే తలపడడానికి రెడీ అయ్యారు. ఇలాంటి సమయంలో షర్మిల జగన్ నివాసానికి వెళ్లి మరీ కలవడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా షర్మిల అన్నతో ఏం మాట్లాడారు? వెంట వచ్చిన తల్లి విజయమ్మ జగన్ ను ఏం కోరారు? షర్మిల ఏపీలో రాజకీయ ప్రయాణంపై జగన్ ఏమైనా చర్చించారా? అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై జగన్ స్పందన ఏంటి? ఇలా ఎన్నోరకాల ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాలలో చర్చకు వచ్చాయి. అలాగే నిన్న మొన్నటి వరకూ జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిలతో కలిసి జగన్ నివాసానికి వెళ్లారు. అన్నపై షర్మిల యుద్దానికి తొలి సైనికుడిని తానే అంటూ ఆర్కే ఇప్పటికే ప్రకటించి మరీ జగన్ గడపతొక్కి వచ్చారు.షర్మిల ఏపీ పర్యటనలో మరో ఆసక్తికర కలయిక కూడా కనిపించింది.  జగన్ ప్రత్యర్థితో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ భేటీ. షర్మిల తాడేపల్లికి వెళ్లి అన్నను కలిశారు. కానీ, షర్మిలతో వచ్చిన ఆమె భర్త అనిల్ కుమార్ మాత్రం జగన్ నివాసానికి వెళ్ళలేదు. కేవలం షర్మిల, ఆమె కుమారుడు, కుమార్తె, కాబోయే కోడలు, తల్లి విజయమ్మ జగన్ నివాసానికి వెళ్లారు. అనిల్ కుమార్ కూడా కడప నుండి విజయవాడ వచ్చినా జగన్ నివాసానికి వెళ్ళలేదు. అలాగే అనిల్ కుమార్ జగన్ ప్రత్యర్థి, పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవితో భేటీ అయ్యారు. బ్రదర్ అనిల్ కుమార్ కడప నుంచి విజయవాడకు బయల్దేరే సమయంలో కడప విమానాశ్రయంలో బ్రదర్ అనిల్ తో టీడీపీ నేతలు బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డితో భేటీ అయ్యారు. ఇది మర్యాద పూర్వక భేటీగా బీటెక్ రవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కానీ, ఇది చూస్తే అలా అనిపించడం లేదు.జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్ మోహన్ రెడ్డిలో వణుకు మొదలైపోయినట్లే. అందుకే జగన్ ఇప్పుడు సింపతీ గేమ్ మొదలు పెట్టినట్లు కనిపిస్తున్నది. తన కుటుంబంలో చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారంటూ ఫ్యామిలీ డ్రామాను హైలెట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  జగన్‌ ఆడుతున్న ఈ ఫ్యామిలీ సింపథీ గేమ్ వర్కవుట్ అవుతుందా?. ఎందుకంటే ఇన్నాళ్లూ వదిలేసిన కుటుంబం జగన్‌కు ఇప్పుడే గుర్చొచ్చిందా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం ఎన్నో రకాల ఎత్తులు వేసిన జగన్.. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం ఆఖరికి కుటుంబాన్ని కూడా వాడేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీకి షర్మిల రాకపై జగన్‌ ఆందోళన చెందుతున్నారు. రాజకీయంగా తనకు నష్టం తప్పదని ఫిక్సయిపోయారు. విషయం ఇప్పుడు తన దాకా వచ్చే సరికి ఉలిక్కి పడుతున్నారు. గత ఎన్నికల్లో తాను ఎన్నో విన్యాసాలను చేయగా.. ఇప్పుడు అవన్నీ కలిసి తన మెడకే చుట్టుకుంటుండటంతో బెంబేలెత్తుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ కు ఉలిక్కిపాటు తప్ప ఇంకేం మిగిలేలా కనిపించడం లేదని తమ కుటుంబంలో చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్ష నేతపై విమర్శలకు గుప్పించడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.


Latest News
more

Trending
more