కర్ణాటక ముఖ్యమంత్రికి భారీ షాక్




కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు భారీ షాక్ తగిలింది. ఆయనకు కలబురగి హైకోర్టు 25 వేల జరిమానా విధించింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యడియూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసు నమోదయింది. బెంగళూరు సమీపంలోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమిని డీనోటిఫికేషన్ చేయడం ద్వారా ఆయన లబ్ది పొందారని సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ ఈ కేసును వేశారు. దీంతో యడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదయింది. తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ ను తొలగించాలంటూ యడ్డి కోర్టును ఆశ్రయించారు. కేసు తీవ్రత దృష్ట్యా అందుకు ఒప్పుకోని కోర్ట్ యడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కేసు విచారణను కొనసాగించాలని కోర్ట్ నిర్ణయం తీసుకుంది. 

ఆ తరువాత ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగకుండా యడియూరప్ప అర్జీ వేశారు. విచారణను అడ్డుకోవడానికి యడ్డి ప్రయత్నిస్తున్నారని హీరేమఠ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విచారణ జరిపిన కలబురగి హైకోర్టు ఈ విషయాన్ని నిర్దారించడమే గాకుండా రూ. 25 వేల జరిమానా విధించారు. దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ నిర్ణయం యడ్డికి శరాఘాతంలా తగిలింది. గతంలో కూడా కోర్ట్ తీర్పు కారణంగానే ఆయన సీఎం పదవి దిగిపోయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా యడియూరప్పకు పదవి గండం అంటూ వస్తున్న వార్తలకు కోర్ట్ తీర్పు బలాన్ని చేకూర్చింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బంధువులకు కూడా లాభం చేకూరిందని పీటీషనర్ తమ పిల్ లో తెలపడం గమనార్హం!


Latest News
more

Trending
more