కలకలం రేపిన కేసీఆర్ బంధువుల కిడ్నాప్




హైదరాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. ముఖ్యమంత్రి పీఏ వేణుగోపాలరావు బావమరిది ప్రవీణ్ రావును బలవంతంగా తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పీఏ వేణుగోపాలరావు ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి తరపు బంధువు. హాకీ క్రీడాకారుడైన ప్రవీణ్ రావుతో పాటు సోదరులైన సునీల్ రావు, నవీన్ రావుల ఇంటికి వెళ్లి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పేరుతో కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా వారిని కిడ్నాప్ చేయడంతో వెంటనే నార్త్ జోన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కిడ్నాపర్లను సినీఫక్కీలు వెంబడించారు. కిడ్నాపర్లు పారిపోతున్న రెండు వాహనాలను రాంగోపాల్‌పేట పరిధిలో పోలీసులు అడ్డగించి కేసీఆర్ బంధువులను రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడ్డ ముగ్గురితో పాటు వారి అనుచరులైన మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అఖిలప్రియ భర్త భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్ కూడా ఉన్నారు.

ఈ కిడ్నాప్‌కు ఒక భూవివాదమే కారణమని ప్రాథమిక సమాచారం. హఫీజ్ పేటలో ఉన్న రూ. 100 కోట్ల విలువైన భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తున్నది. ఈ వివాదం ముదరడంతో ఒక వర్గం మరో వర్గంలోని వ్యక్తులను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. కాగా, కిడ్నాప్‌కు గురైన అందరినీ పోలీసులు క్షేమంగా రక్షించారని.. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నారని వారి కుటుంబీకులు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించడంతోనే వారు బయటపడినట్లు చెప్పారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
more

Trending
more