కళ తప్పిన న్యూ ఇయర్‌ వేడుకలు




నూతన సంవత్సర వేడుకలపై కరోనా పడగ నీడ పడింది. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా పలు చోట్ల ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూను అమల్లోకి తెచ్చాయి. నూతన సంవత్సర సందర్భంగా ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా చూసేందుకు డిసెంబర్‌ 31, జనవరి 1 తేదీల్లో రాత్రి 11 నుంచి పగలు 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోకి కొత్తగా వచ్చిన యూకె స్ట్రెయిన్‌ వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నది కాబట్టి సమూహ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ విజయ్‌ దేవ్‌ చెప్పారు.

రాత్రి కర్ఫ్యూ సమయంలో పబ్లిక్‌ ప్లేసుల్లో ఐదుగురు కన్నా ఎక్కువమంది గుమికూడరాదని తెలిపారు. అయితే అంతరాష్ట్ర, రాష్ట్రంలోపల ప్రయాణాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో 7 కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇటీవల యూకే నుంచి వచ్చిన వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను ఢిల్లీ ప్రభుత్వం చేపట్టింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి నైట్‌ కర్ఫ్యూ విధించడం లేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్య కార్యదర్శి చెప్పారు. పరిస్థితి మరీ అంతలా అదుపుతప్పలేదన్నారు. అయితే భారీగా గుమిగూడికలు నిలిపేందుకు తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రజలంతా అధికారులకు సహకరించాలన్నారు. 

ముంబైలో 35వేల మంది పోలీసులు..

కరోనా నివారణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి 11– ఉదయం 6గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ముంబైలో కర్ఫ్యూ అమలు కోసం 35వేల మంది పోలీసులను మోహరించారు. బెంగళూరులో కూడా పోలీసులు ఇలాంటి నిబంధనలే తెచ్చారు. చెన్నైలోని రెస్టారెంట్లు, హోటల్స్, క్లబ్స్, రిసార్టులను రెండు రోజులు మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒడిషాలో రాత్రి 10గంటల నుంచి నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తామని ఆరాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజలు గుమిగూడకుండా నిరోధించేందుకు 40 ప్లటూన్ల పోలీసు బలగాలను మోహరించారు.


Latest News
more

Trending
more