రోహిత్ శర్మకు ప్రమోషన్‌




భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు కొత్త ఏడాది వస్తూనే కానుక ఇచ్చింది. ఇప్పుడు ‘హిట్‌మ్యాన్‌’ వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందాడు. ఐపీఎల్‌లో చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ అయిన రోహిత్‌ను కోహ్లి లేని భారత టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్‌ రహానేకు చేదోడు–వాదోడుగా నియమించారు. దీంతో వైస్‌ కెప్టెన్‌ బాధ్యతల్లేని చతేశ్వర్‌ పుజారా ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో పుజారా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ  తాత్కాలికమే! రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి పెటర్నటీ లీవ్స్‌ ముగించుకొని రాగానే మళ్లీ రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు వెల్లడించారు. అతను తుది జట్టులో ఖాయమైనప్పటికీ ఓపెనింగ్‌లో దిగుతాడా లేదంటే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడా అన్నదానిపై స్పష్టత లేదు. 14 రోజుల క్వారంటైన్‌ పూర్తయిన రోహిత్‌ శర్మ జట్టుతో చేరాడు. ప్రస్తుతం మూడో టెస్టు కోసం అతను సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరుగుతుంది.

ఉమేశ్‌ స్థానంలో నటరాజన్‌

ఈ కరోనా కాలంలోనూ లక్కీ చాన్సంటే నటరాజన్‌దే! తమిళనాడుకు చెందిన ఈ ‘యార్కర్‌’ సంచలనం ఇక టెస్టు మ్యాచ్‌ కూడా ఆడనున్నాడు. గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో మిగిలున్న రెండు టెస్టుల్లో ఈ పేసర్‌ బరిలోకి దిగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ‘సీనియర్‌ సీమర్‌ ఉమేశ్‌ తీవ్రమైన ఎడమకాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. మూడో టెస్టుకల్లా పూర్తిగా కోలుకునే అవకాశం లేదు. దీంతో మూడు, నాలుగు టెస్టుల కోసం అతని స్థానంలో నటరాజన్‌ ఆడతాడు’ అని షా వెల్లడించారు.


Latest News
more

Trending
more