కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల




కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల


అక్షరవిజేత, ఎడిటర్ అనిల్ కుమార్ :


షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడమన్న లాంఛనం పూర్తయ్యింది. గురువారం (జవనరి 4) ఉదయం హస్తినలో  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో వీలీనం కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఇక ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేతపట్టి కాంగ్రెస్ ను రాష్ట్రంలో  బలోపేతం చేయడంతో పాటు, ఏపీ సీఎం అన్న పాలనలోని అవకతవకలను, ఆర్థిక అరాచకత్వాన్ని ఎండగడుతూ ముందుకు సాగుతారా, పార్టీ అధిష్ఠానం ఆమెకు అప్పగించే బాధ్యతలు ఏమిటన్నది ఇహనో ఇప్పుడో స్పష్టమౌతాయి. కానీ షర్మిలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడమే ఏపీలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆమెకు అప్పగించడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
సాధారణంగా ఒక పార్టీ రాష్ట్ర బాధ్యతలను చేపట్టే విషయంలో ఏ పార్టీలోనైనా పోటీ ఉంటుంది. రేసులో నలుగురైదుగురు ఉంటారు. కానీ ఏపీ విషయంలో మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు రుద్రరాజుతో సహా పార్టీలోని సీనియర్ లు అందరూ కూడా షర్మిలకే ఆ బాధ్యతలకు అప్పగించాలని ముక్తకంఠంతో కోరారు. రాష్ట్ర విభజనతో ఏపీలో ఉనికి మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ ను అధికార రేసులోకి తీసుకురావాలంటే షర్మిలకు బాధ్యతలు అప్పగించడమే మేలని అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రం విభజనకు ముందే కాంగ్రెస్ తో విభేదించి  దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన వైసీపీలోకి కాంగ్రెస్ లో అంతో కొంతో ప్రజాదరణ ఉన్న నేతలంతా చేరిపోయారు. మరీ ముఖ్యంగా వైఎస్ తో అనుబంధం ఉన్న వారు, ఆయనపై అభిమానం ఉన్న వారూ అందరూ కూడా వైఎస్ వారసుడిగా జగన్ ను భావించి ఆయన పంచన చేరిపోయారు. అలాగే  వైఎస్ విశేష జనాదరణ ఉన్న నేత కావడంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా జగన్ పార్టీకే షిఫ్ట్ అయిపోయారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ  లీడర్, కేడర్ కూడా లేకుండా  మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా ఆ పార్టీకి చట్ట సభలో ప్రాతినిథ్యం కూడా లభించలేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడంతో ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పుడు ఏపీపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇక గత నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ అన్ని విధాలుగా ప్రజల అభిమానాన్ని దూరం చేసుకున్నారు. కరుడుగట్టిన వైఎస్ అభిమానులు కూడా జగన్ ఎంత మాత్రం వైఎస్ రాజకీయ వారసుడు కాదన్న నిర్ధారణకు వచ్చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ జగన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇక పార్టీలో కూడా జగన్ ఒంటెత్తు పోకడలపై అసంతృప్తి పీక్స్ కు చేరింది. అయితే జగన్ తో పాటు ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచీ అడుగులు వేస్తున్న పాత కాంగ్రెస్ నేతలు, వైఎస్ అభిమానులు మరో గత్యంతరం, ప్రత్యామ్నాయం లేక అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో  షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో జగన్ పార్టీలో  ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కొనసాగుతున్న వారందరికీ ఒక గమ్యం దొరికినట్లైంది. ఇక షర్మిల విషయానికి వస్తే.. జగన్ వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన క్షణం నుంచీ తన అన్న జగన్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేశారు. అన్న అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్లి నప్పుడు పార్టీని ముందుండి నడిపించారు. అన్న కోసం కాళ్లరిగేలా పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలో  సెంటిమెంటును రగిల్చారు. తన శక్తికి మించి కృషి చేసి అన్నను సీఎంగా చూశారు. 2019 ఎన్నికలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయంలో షర్మిల పాత్ర విస్మరించలేనిదనడంలో సందేహం లేదు. అటువంటి షర్మిలను, సొంత చెల్లి అని కూడా చూడకుండా సీఎం అయిన తరువాత పార్టీకి దూరం పెట్టారు. అసలు రాష్ట్రంలోనే ఉండలేని పరిస్థితులు కల్పించి తెలంగాణకు తరిమేశారు. అక్కడ షర్మిల తండ్రి ఆశయాల సాధన కోసం సొంత రాజకీయ పార్టీ వైఎస్సార్టీపీ పెట్టుకున్నారు. అయితే అక్కడా ఆమెకు అడుగడుగునా అవరోధాలు కల్పించారు. ఎవరి నుంచీ ఆమెకు ఎటువంటి సాయం అందకుండా చేశారు. 
ఇప్పుడు ఆమె అన్నతో ఢీ కొనేందుకు ఏపీ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆమెకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది.  ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తారన్నది స్పష్టం అవ్వడంతోనే జగన్ పట్ల అసంతృప్తి ఉన్న వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ బాట పడుతున్నారు. వీరిలో నిన్నమొన్నటి వరకూ జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ఒకరు. షర్మిలమ్మ వెంటే తన అడుగులు అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించేశారు. తాజాగా దివంగత వైఎస్ కు అనుయాయిగా పేరొందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే షర్మిలతో టచ్ లోకి వచ్చారని కూడా అంటున్నారు. ఆయన అడుగులు కాంగ్రెస్ వైపే పడుతున్నాయనడానికి నిదర్శనంగా ఆయన అనుచరులు జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజయవాడలో ధర్నాలు నిర్వహించారు. మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమయ్యారు. 
రానున్న రోజులలో ఇలా కాంగ్రెస్ గూటికి చేరు వైసీపీ నేతల సంఖ్య మరింత పెరుగుతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరిపోవడంతో సిట్టింగులను మార్చేస్తున్న జగన్ ముందు ముందు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితుల్లో పడ్డా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


Latest News
more

Trending
more