జగన్ ని నాడు గెలిపించాయి.. నేడు ఒడిస్తున్నాయి




జగన్ ని నాడు గెలిపించాయి.. నేడు ఒడిస్తున్నాయి

 

అక్షరవిజేత, ఏపీ బ్యూరో :

 

 

నిన్న మొన్నటి దాకా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి, ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారంటూ వచ్చిన వార్తలలో వాస్తవం ఎంత, ప్రచారం ఎంత అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతూ ఉండేవి. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తారని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు వంటి వారు మీడియా సమావేశంలో ప్రకటించేసినా కూడా షర్మిల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ లోకి వస్తారా? రారా? అన్న అనుమానాలు అలాగే ఉండిపోయాయి.కానీ షర్మిల ఒకే ఒక్క మాటతో ఆ అనుమానాలన్నిటినీ నివృత్తి చేసేశారు. తనకు కాంగ్రెస్  నుంచి ఆహ్వానం ఉందనీ, ఆ పార్టీతో కలిసి ప్రయాణిస్తాననీ మీడియా సమావేశంలో విస్పష్టంగా ప్రకటించేశారు. అంతకు ముందు పార్టీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయిన షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు తెలిపారు. 

ఆ తరువాత పులివెందుల వెళ్లిన ఆమె వైఎస్ సమాధి వద్ద తన కుమారుడి పెళ్లి శుభలేఖ ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం (జనవరి 3) తన సోదరుడు జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లి శుభలేఖ అందించనున్నారు. ఆ తరువాత ఆమె హస్తిన వెళ్ల నున్నారు.  తెలంగాణ ఎన్నికలలో తన వైఎస్సార్టీపీని పోటీ కి దూరంగా ఉంచడం కాంగ్రెస్ కు లాభించిందనీ షర్మిల చెప్పారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఏపీలో పార్టీని కాపాడాల్సిందిగా కోరుతున్నారనీ, అందుకు తనకు ఇసుమంతైనా అభ్యంతరం లేదనీ చెప్పారు. విలీనం, ఇతర అంశాలపై చర్చించేందుకే తాను హస్తిన వెడుతున్నట్లు చెప్పారు. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీలో రాజకీయాలు చేస్తే జగన్ పరిస్థితి ఏమిటి అన్నది చూస్తే..గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో రివర్స్ పాలన సాగించిన జగన్ కు ఎన్నికల సమయం వచ్చే సరికి 2019 ఎన్నికలలో అనుకూలంగా ఉన్న ప్రతి అంశమూ ఇప్పుడు రివర్స్ అవుతోంది. ప్రతి కూలంగా మారుతోంది. గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ విజయంలో మేజర్ క్రెడిట్ షర్మిలకు కూడా దక్కుతుందనడంలో సందేహం లేదు. జగన్ పాదయాత్ర, ప్రచారం, వాగ్దానాలూ అన్నీ ఒకెత్తు అయితే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం ఒక్కటీ ఒకెత్తు అని చెప్పాలి.నాడు జగన్ విజయానికి ఎంతగానో దోహదపడిన షర్మిల ఇప్పుడు జగన్ కు రివర్స్ అయ్యారు. సొంత అన్నకి భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు.  ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించేందుకు సమాయత్తమౌతున్నారు. నేడో, రేపో ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆమె ఏపీలో అడుగుపెట్టగానే ఆమె వెంట అడుగులు వేయడానికి మంగళగిరి ఎమ్మెల్యే, నిన్నటి వరకూ జగన్ కు నమ్మిన బంటు అన్నట్లుగా మెలిగిన ఆర్కే రెడీగా ఉన్నారు. ఇప్పటికే షర్మిల వెంటే తన అడుగులు అని ప్రకటించేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామా చేసేశారు.  నాడు జగన్ కోసం అమరావతిపై కేసులతో విషం కక్కిన ఆర్కే ఇప్పుడా కేసులను ఉపసంహరించుకోకతప్పని పరిస్థితి. షర్మిల వెంటే అని అడుగులు ప్రకటించిన ఆర్కే నిస్సందేహంగా కాంగ్రెస్ గూటికే చేరుతారు. అంటే ఏ నోటితో అయితే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారో అదే నోటితో ఇప్పుడు ఆయన అమరావతికి జై కొట్టక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నిటిలోనూ అత్యంత ముఖ్యమైనది ప్రత్యేక హోదా, అమరావతి రాజధానికి కూడా కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపింది. దీంతో ఇప్పుడు అనివార్యంగా ఆర్కే రాజధాని అమరావతికి అనుకూలంగా గళమెత్తక తప్పదు. అంటే తన చేత జగన్ అమరావతికి వ్యతిరేకంగా బలవంతంగా ప్రకటనలు చేయించారనీ, కేసులు పెట్టించారని చెప్పాల్సి ఉంటుంది.అంతే కాకుండా ఆ కేసులను కూడా ఉప సంహరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే షర్మిల సూచన మేరకు కేసుల ఉపసంహరణకు ఆర్కు అంగీకరించారని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ చెప్పినట్లు దేవుడి స్క్రిప్ట్ జగన్ కు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేసినట్లేనని చెప్పాలి.  ఇక 2019 ఎన్నికలలో జగన పట్ల సానుభూతి పెరగడానికి దోహదం చేసిన బాబాయ్ హత్య కేసు, జగన్ పై కోడికత్తి దాడి కేసులు ఇప్పుడు జగన్ మెడకే చుట్టుకున్నాయి. బాబాయ్ వైఎస్ వివేకా హత్య  సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది కోర్టులు తేల్చాల్సి ఉన్నప్పటికీ వారెవరన్న విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్ధమైపోయింది. బాబాయ్ హత్య కేసులో జగన్ ఎవరిని కాపాడుతున్నారో, ఎవరికి అండగా నిలుస్తున్నారో కూడా స్పష్టమైపోయింది. దీంతో నాడు సానుకూలంగా ఉన్న ప్రతి అంశమూ ఇప్పుడు ఆయనకు రివర్స్ గేర్ లో ఎదురు నిలుస్తోంది. నాడు విజయానికి దోహదపడిన అంశాలే ఇప్పుడు ఆయనకు మరో చాన్స్ దక్కే అవకాశం లేకుండా అడ్డం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.


Latest News
more

Trending
more