తాడేపల్లి ప్యాలస్‌లో టికెట్ల దందా?




తాడేపల్లి ప్యాలస్‌లో టికెట్ల దందా?


అక్షరవిజేత, ఎడిటర్ :

ఏపీలో అధికార  వైసీపీ ఎన్నికల హడావుడి మొదలు పెట్టేసింది. ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి గెలుపు ధీమాలో ఉన్నట్లు కలరింగ్ ఇవ్వడమే లక్ష్యంగా జగన్ హడావుడి చేస్తున్నారు. అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, ఎమ్మెల్యేలను పార్లమెంటుకు, ఎంపీలను అసెంబ్లీకి పంపాలన్న స్కెచ్ లు, పలువురు సిట్టింగులకు సీట్ల గోవిందా అన్న లీకులూ అన్నీ ఇందులో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సిట్టింగుల మార్పులో బాగంగా  కొంత మంది  ఎమ్మెల్యేలను సొంత జిల్లా నుండి పక్క జిల్లాకు తరిమేస్తున్నారు. మంత్రులకు కూడా కొందరికి టికెట్లు లేవని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఏ జిల్లాకి ఆ జిల్లా ఎమ్మెల్యేలను తాడేపల్లి పిలిపించి సీఎం జగన్, వైసీపీ పెద్దలు బుజ్జగింపులు, బెదరింపులు, హెచ్చరికలతో సమాధానపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానాలు మారిన కొందరు ససేమీరా వెళ్ళేది లేదని భీస్మించుకు కూర్చుంటుంటే.. మరికొందరు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరైతే తిరుగుబాటుకు సిద్దమై వైసీపీ ఓటమికి కంకణం కట్టుకుంటున్నారు. మొత్తంగా ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత సీఎం క్యాంప్ కార్యాలయం  తాడేపల్లి ప్యాలెస్ వచ్చి వెళ్లే నేతలతో సందడిగా కనిపిస్తున్నది. ఒకరి వెనక ఒకరు ఎమ్మెల్యేలంతా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి పరుగులు పెడుతూ హడావుడి పడుతున్నారు.

ఇప్పటికే 11 మంది స్థానాలను మారుస్తూ వైసీపీ అధికారికంగా ప్రకటన రోడీ అయ్యిందని చెబుతోంది.  ఈ జాబితాలో ఉన్న వారికి   సీఎం క్యాంపు కార్యాలయం నుండి పిలుపులు అందుతున్నాయి. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ కు క్యూకడుతున్నారు. తాజాగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి,  తాడేపల్లి వచ్చారు. సీఎంఓ అధికారి ధనుంజయరెడ్డిని కలిసి మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తున్నది. స్థానాల మార్పు మాత్రమే ప్రకటిస్తున్న సీఎం జగన్ అసంతృప్తులను బుజ్జగించే పనిని మిగతా పార్టీ పెద్దలకు అప్పగించినట్లు తెలుస్తుంది. మొత్తంగా నియోజకవర్గ ఇంచార్జ్‌ల మార్పులపై  కసరత్తు అయితే యమా సీరియస్ గా కొనసాగుతోంది.

అంతకు ముందు ఎమ్మెల్యేలు కరణం ధర్మ శ్రీ, గొల్ల బాబూరావు, బియ్యపు మధుసూధన్, కదిరి, పెనుగొండ, రాజాం ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పెద్దలతో సమావేశమయ్యారు. తాడేపల్లి నుండి పిలుపురావడం, ఎమ్మెల్యేలు చర్చలకు వెళ్లడం.. ఉసూరుమంటూ తిరిగి రావడం   నిత్యకృత్యంగా మారిపోయింది. వచ్చి వెళ్లే ఎమ్మెల్యేలలో కొందరు బహిరంగంగానే విమర్శలకు దిగుతుండగా.. ఇలాంటి గొడవలు మామూలే అంటూ పార్టీ పెద్దలు తేలికగా తీసుకుంటున్నారు. అంతేకాదు  ఆ మాత్రం పోటీ, ఆందోళనలు లేకపోతే పార్టీ బలం ఎలా తెలుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి డాబుసరి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ నిజానికి ఎమ్మెల్యేల అసంతృప్తి ఇప్పుడు వైసీపీకి పెద్ద టెన్షన్ గా మారింది. ఒకవైపు ప్రజలు అసంతృప్తి కారణంగా చూపి ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. అయితే నిండా మునిగిన వాడికి చలేమిటన్నట్లు జగన్ మోహన్ రెడ్డి మాత్రం మొండిగా అభ్యర్థులను మార్చేసుకుంటూ పోతున్నారు. అభ్యర్థుల మార్పు ఒక్కటే ఇప్పుడు తనని రక్షించి, పార్టీని బతికించే సంజీవనిగా  జగన్ నమ్ముతున్నట్లు కనిపిస్తున్నది.

శ్రీకాకుళం నుండి విజయవాడ వరకూ.. గోదావరి జిల్లాల నుండి రాయలసీమ వరకూ ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా  వైసీపీ సిట్టింగుల మార్పు హడావుడి, అయోమయం, గందరగోళం, నిర్వేదం, నిస్తేజం, నిస్ఫృహ, అసమ్మతి, ఆగ్రహం కనిపిస్తోంది. నియోజకవర్గాల మార్పుతో ఇన్నాళ్లు రాజకీయం చేసిన నియోజకవర్గాలను వదిలేసి సామాన్లు సర్ధేసుకుని ఉసూరుమంటూ కొందరు ఎమ్మెల్యేలు కేటాయించిన స్థానాలకు వెళ్లిపోతున్నారు. అయితే, వెళ్లిన చోట ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం.. కొత్త ఇంచార్జిల నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితే కనిపించడం లేదు.  నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యతిరేక వర్గం ఇలాగే వైసీపీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగారు. ఇది ఒక్క చోట మాత్రమే కాదు.. రేపు రెండో జాబితా కూడా వస్తే.. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే సీన్ కనిపించడం గ్యారంటీగా కనిపిస్తున్నది. అసలు ఎమ్మెల్యే ఎవరో.. ఎవరి కోసం పనిచేయాలో కూడా అర్ధం కాక పలు నియోజకవర్గాలలో వైసీపీ క్యాడర్ గందరగోళంలో ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీలో ఈ జంబ్లింగ్  ఆ పార్టీకి మేలు చేసే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


Latest News
more

Trending
more