వైసీపీ ఓట్ల చిలికే లక్ష్యంగా కాంగ్రెస్ గూటికి షర్మిల




వైసీపీ ఓట్ల చిలికే లక్ష్యంగా
కాంగ్రెస్ గూటికి షర్మిల


అక్షరవిజేత,ఎడిటర్ అనిల్ కుమార్

ఎన్నికలలో ఎప్పుడైనా జయాపజయాలను నిర్ణయించేది తటస్థులే. ఎందుకంటే ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీకే ఓటు వేస్తారు. తటస్థుల ఓట్లు ఎటువైపు పడ్డాయన్నదే విజయాన్ని నిర్ణయిస్తుంది.  ఎన్నికలు హోరోహోరీగా సాగుతే తటస్థుల ఓట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే, ఇండియా   కూటముల మధ్య హోరా హోరీ పోరు తప్పదన్నది పరిశీలకుల విశ్లేషణ. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ కూటమి వైపు తటస్థులు మొగ్గు చూపితే ఆ కూటమి విజయం సాధిస్తుందన్న మాట. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలలో కూడా తటస్థుల మొగ్గే ఏ రాష్ట్రంలోనైనా  అధికారం చేపట్టే పార్టీని నిర్ణయిస్తుంది. 
కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో తటస్థులన్న వారే లేకుండా పోయారు. నిన్న మొన్నటి వరకూ తటస్థంగా ఉన్న వారు కూడా జగన్ సర్కార్ అరాచకపాలనతో తమ తటస్థవైఖరి వీడి  తెలుగుదేశం వైపు మారిపోయారు.

ఎన్నికలకు చాలా ముందుగానే  న్యూట్రల్స్ అందరూ జగన్ కు వ్యతిరేకంగా మారిపోవడానికి దోహదం చేసిన కారణం ఏదైనా ఉందంటే అది స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడమే. ఔను ఆ సంఘటనే రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలన్న దానిపై చివరి నిముషం వరకూ తర్జనభర్జనలు పడుతూ పాలనా తీరును నిశితంగా గమనిస్తూ ఉండే న్యూట్రల్స్ తమ  తటస్థ వైఖరి మార్చుకునేలా చేసింది.  14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ, దేశ, రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంగా రాజకీయాలు చేసిన చంద్రబాబును  ఆధారాలు లేకుండా, కేవలం ఆరోపణలతోనే అక్రమంగా అరెస్టు చేయడం పట్ల ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయ్యింది.  ఏపీలో ఆ నిరసనలను అణచివేయడానికి జగన్ సర్కార్ చేసిన యత్నాలపై మరింత ఆగ్రహం పెల్లుబికింది. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఎగసి పడిన ఆగ్రహజ్వాలలను ఎవరూ రగిలించ లేదు, ఆందోళనలను ఎవరూ ఆర్గనైజ్ చేయలేదు. జనం స్వచ్ఛందంగా ఆ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రోడ్ల పైకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఐదేళ్లు పని చేసిన చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు, అనితర సాధ్యమైన దార్శనికతతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రస్తావిస్తూ అటువంటి నేత అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తటస్థులు సైతం ఆందోళనల్లో అగ్రపీఠిన నిలిచారు.  ఆ సందర్బంగానే వారు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా  ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అందుకే ఏపీలో తటస్థులు అనే వారు లేకుండా పోయారు.

ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే... 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. ఆ వార్తతో జగన్ పార్టీ కాళ్ల కింద నేల కదిలిపోతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు సొంత సోదరి షర్మిల అన్నకు వ్యతిరేకంగా గళమెత్తితే..  ఇప్పటికే మసకబారిన జగన్ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. అంతే కాకుండా జగన్ పార్టీలో ఉన్న అసంఖ్యాక వైఎస్ అభిమానులు షర్మిలకు మద్దతుగా వైసీపీని వీడి కాంగ్రెస్ బాట పట్టే అవకాశాలున్నాయనీ అంటున్నారు. దీంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.

దీంతో జగన్ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం తనకు మాత్రమే తెలిసిన రీతిలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే నష్టం విపక్ష  కూటమికే నంటే కొత్త భాష్యం చెబుతోంది. లాజిక్ ను, ఇంగితాన్ని పూర్తిగా వదిలేసి షర్మిల కాంగ్రెస్ చేరిక వల్ల వైసీపీకే లాభం అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ పార్టీ క్యాడర్ ను నమ్మించడానికి నడుంబిగించేసింది. అయితే కనీస హేతుబద్ధత లేని ఆ వాదన పార్టీ కేడర్ ను  ఇసుమంతైనా నమ్మించ లేకపోతోంది సరికదా.. వారిలో మరింత భయాన్ని నింపుతోంది.  ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో షర్మిల కాంగ్రెస్ చేరికపై వస్తున్న వ్యాఖ్యలను ఒక సారి చూద్దాం...

షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందనీ, అది వైసీపీకే మేలు చేస్తుందన్నది వైసీపీ మేథావులు వండివారుస్తున్న పైత్యం. అదే ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆ పార్టీ బలోపేతమై..ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలుతుందన్నది ఆ ప్రచార సారాంశం. దీంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల నష్టపోయేది తెలుగుదేశం తప్ప వైసీపీ కాదని గట్టిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయితే ఆ వాదనలోని డొల్లతనం కారణంగా వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం సొంత పార్టీలోనే నవ్వుల పాలౌతోంది.  
ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉంటే అంతగా ఓటర్లు అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు. చివరిగా తటస్థులు ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఏపీలో జగన్ సుందర ముదనష్ట పాలన చూస్తున్న జనం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత న్యూట్రల్ ఓటనేదే లేకుండా పోయింది. ఇక ఇప్పుడు వైసీపీకి మిగిలింది.. ఆ పార్టీకి హార్డ్ కోర్ అని చెప్పుకుని కాలరెగరేస్తున్న కేడర్ మాత్రమే. నియోజకవర్గాల మార్పు ప్రహసనానికి జగన్ తెరలేపిన తరువాత.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే పక్క చూపులు చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలలో అవకాశం లేని వారందరి చూపూ కాంగ్రెస్ వైపే మళ్లుతోంది. ఇప్పుడు ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక విషయానికి వస్తే..

షర్మిల కాంగ్రెస్ లో చేరిక వల్ల చీలేది వైసీపీ ఓట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే.. ఇప్పటికే జగన్ పార్టీకి ప్రత్యామ్నాం ఏమిటన్న విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. వారు ఇప్పుడు షర్మిల చేరారుకనుక కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేదు. అయితే షర్మిల చేరికతో కాంగ్రెస్ కు ఓట్లు పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఆ పెరిగే ఓట్లు వైసీపీ నుంచే ఉంటాయన్నది పరిశీలకుల విశ్లేషణ. గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు దాదాపుగా వైసీపీకి మళ్లిపోయింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ చేరికతో ఆ ఓటే తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లుతుంది. అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల భారీగా నష్టపోయేది వైసీపీ మాత్రమే.  ఈ విషయం స్పష్టంగా తెలిసి కూడా డంబాలకు పోతూ వైసీపీ అగ్రనాయకత్వం జనాలను మభ్యపెట్టగలమన్న భ్రమల్లో ఉంది.


Latest News
more

Trending
more